ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికగా దాయాది పాకిస్థాన్‌కు భారత్ మరోసారి గట్టిగా బదులిచ్చింది. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ లో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగిస్తూ ఈ ఏడాది ప్రారంభంలో భారత్ నుంచి ప్రేరేపిత దాడిని ఎదుర్కొన్నామంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ గురించి, భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేయడంపై ప్రస్తావించారు. తమ సైన్యం అద్భుతమైన నైపుణ్యం, ధైర్యం, చతురతతో భారత్ దాడిని తిప్పికొట్టాయంటూ చెప్పుకొచ్చారు. భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేయడాన్ని యుద్ధ చర్యగా అభివర్ణించారు. ఆయన వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్, అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలు చెబుతోందని పేర్కొంది.

పాక్ ప్రధాని వ్యాఖ్యలపై భారత దౌత్యవేత్త పేటల్ గహ్లోత్ స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాక్, అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపడదు. అయితే, ఏ స్థాయిలోనూ వాస్తవాలను వారి అబద్ధాలు దాచలేవు. ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో మునిగిపోయింది. ఉగ్రవాదంపై యుద్ధంలో భాగస్వామిగా నటిస్తూనే, ఒక దశాబ్దం పాటూ ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించింది అంటూ వ్యాఖ్యానించారు.
















