జర్మనీలో బెర్లిన్‌లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చేరిన చాలా మంది విద్యార్థుల కలలు కల్లలవుతున్నాయి. వీసా నోటీసులు, కోర్టు అప్పీళ్లు, డిపోర్టేషన్ భయాలతో వణికిపోతున్నారు. విద్యార్థులు విద్యా రుణాలు తీసుకుని, లక్షలాది రూపాయల ట్యూషన్ ఫీజులు చెల్లించారు. అయితే, తమను జర్మనీ నుంచి వెళ్లిపొమ్మంటున్నారని కొందరు విద్యార్థు లు చెప్పారు. దీనికి కారణం వారు చట్టాన్ని ఉల్లంఘించడం కాదని, ఇమిగ్రేషన్ అధికారులు వీరి యూనివర్సిటీ ప్రోగ్రామ్‌లను వేరొక రకంగా నిర్వచించడమేనని తెలుస్తుంది. ఇంత హఠాత్తుగా తమ లీగల్ స్టేటస్ ఏవిధంగా పతనమైందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.

భారతీయ విద్యార్థులకు ఈ పరిణామాలు తీవ్రమైనవే. చాలా మంది భారత దేశంలో విద్యా రుణాలు తీసుకుని, ఒకొక్కరు రూ.21.15 లక్షలు చొప్పున ఖర్చు చేశారు. భారత దేశం నుంచి దూర విద్యా విధానంలో ఈ చదువులు కొనసాగించవచ్చునని కొందరు విద్యార్థులకు చెప్తున్నారు. కానీ వీరికి మొదట్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆన్-క్యాంపస్ జర్మన్ ఎడ్యుకేషన్ అందిస్తామని జర్మన్ విద్యా సంస్థలు హామీ ఇచ్చాయి. ప్రస్తుత పరిణామాలు అమెరికా, బ్రిటన్‌ల కన్నా జర్మనీ విద్య అందుబాటులో ఉంటుందనే నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయి.















