పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఓ వ్యక్తి ఎడ్యుకేషన్ మైగ్రేషన్ సర్వీసెస్ నిర్వహిస్తున్నాడు. కెనడాలోని యూనివర్సిటీల్లో విద్యార్థులకు అడ్మిషన్ కోసం ఒక్కో భారతీయ విద్యార్థి నుంచి రూ.16 లక్షల వరకూ వసూలు చేస్తారు. దీంతో అనేక మంది 2018-19 మధ్య కాలంలో కెనడాకు వెళ్లి చదువులు పూర్తి చేశారు. వీరిలో కొందరు అక్కడే ఉద్యోగం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో అతడి ద్వారా కెనడాకు వెళ్లిన కొందరు అక్కడ శాశ్వతనివాసార్హత కోసం చేసుకున్నారు. ఈ క్రమంలో అక్కడి అధికారులు వారి దరఖాస్తులు పరిశీలించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కెనడాలో అడ్మిషన్ పొందే సమయంలో కొందరు భారతీయ విద్యార్థులు నకిలీ సర్టిఫికేట్లు సమర్పించినట్టు అధికారులు గుర్తించారు. దీంతో తీగ లాగితే డొంక బయటపడింది. ప్రస్తుతం కెనడాలో ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 700 మంది భారతీయులను స్వదేశానికి తరలించే దిశగా ప్రస్తుతం కెనడా ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో వారు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయారు. ఎప్పుడు దేశాన్ని వీడాల్సి వస్తుందో తెలీక బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. ఇప్పటికే కెనడాలోని బార్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ కొందరు భారతీయులకు డిపోర్టేషన్ లెటర్లు పంపించిందట.
