భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో భేటీ అయ్యారు. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యాక ప్రధాని మోదీతో ప్రత్యక్షంగా సమావేశం కావడం ఇదే తొలిసారి. భారత్ తమకు అత్యంత కీలక భాగస్వామ్య దేశమని కమలా హ్యారిస్ అన్నారు. వ్యాక్సిన్ ఎగుమతులను తిరిగి ప్రారంభించాలనే భారత్ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రపంచాన్ని సురక్షితంగా, భద్రంగా ఉంచడానికి ఇరుదేశాలు ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నాయన్నారు. ప్రపంచం ప్రస్తుత పలు సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ తరుణంలో అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం కావాలని కమల ఆకాంక్షించారు. కోవిడ్ మహమ్మారిపై సమిష్టిగా పోరాడుదామన్నారు. సమస్యలపై పోరులో భారత్ ధృడ సంకల్పాన్ని అభినందించారు. రోజుకు కోటీ డోసులు ఇస్తున్నారని భారత్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మెచ్చుకున్నారు.
భారత్, అమెరికాలు ప్రపంచంలోని రెండు అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్య దేశాలని ప్రధాని మోదీ అన్నారు. విలువలు, ప్రాదేశిక రాజకీయ ఆసక్తులు ఒకటేన్నారు. ఇరు దేశాల సంబంధాలు నానాటికీ బలోపేతమవుతున్నాయన్నారు. సప్లయ్ చైన్స్, నూతన సాంకేతికతలు, అంతరిక్ష రంగాలపై మీకు ఆసక్తి ఎక్కువని తెలుసు..నాకు కూడా వీటిపై ఎంతో ఆసక్తి ఉందని మోదీ అమెరికా ఉపాధ్యక్షురాలిని ఉద్దేశించి అన్నారు. కరోనా సెకండ్‌వేవ్ సంక్షోభ సమయంలో భారత్‌కు అమెరికా చేసిన సహాయాన్ని మరువలేమన్నారు. మీరు నిజమైన మిత్రుడిలా వ్యవహరించి అండగా నిలిచారని కొనియాడారు. మీరు భారత్‌కు రావాలని దేశ ప్రజలు ఎంతో కోరుకుంటున్నారని, తమ దేశానికి రావాలని కమలా హ్యారిస్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు.