విదేశీయులకు ఇండోనేషియా సర్కార్ తీపి కబురు చెప్పింది. కరోనా సంక్షోభం కారణంగా నిలిపివేసిన మల్టీపుల్ ఎంట్రీ వీసాల జారీని తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంబంధిత అధికారులు కీలక ప్రకటన చేశారు. మల్టీపుల్ ఎంట్రీ వీసాతో వ్యాపారవేత్తలు, విదేశీ పర్యాటకులు మళ్లీ మళ్లీ వీసా కోసం దరఖాస్తు చేసుకోకుండా ఏడాదిలో పలుమార్లు ఇండోనేషియా వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అలాగే విజిటర్ ఆ దేశంలో 60 రోజులు బస చేయవచ్చు. ఇకపోతే ఈ వీసాదారులు ఇండోనేషియాలోని రియావు దీవుల ప్రావిన్స్‌లో ప్రవేశించడానికి, అక్కడి నుండి స్వదేశానికి వెళ్లడానికి కూడా అనుమతించబడతారు. అలాగే సందర్శకులు బస సమయంలో దేశంలోని ఇతర ప్రాంతాలను సందర్శించడానికి సైతం ఎలాంటి రుసుము ఉండదు.