ఉక్రెయిన్పై యుద్ధం సాగిస్తోన్న రష్యాకు అంతర్జాతీయ న్యాయస్థానం నుంచి గట్టి షాక్ తగిలింది. ఉక్రెయిన్పై సైనిక ఆపరేషన్ను తక్షణం నిలిపివేయాలని రష్యాను ఆదేశించింది. ఫిబ్రవరి 24 నుంచి సాగుతోన్న దాడులను వెంటనే నిలిపివేయాల్సిన అవసరం ఉందని కోర్టు 13/2 ఓట్ల తేడాతో ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితిని దిగజార్చే ఎటువంటి చర్యకూ ఇరుపక్షాలు పాల్పడరాదని న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. దాడులు నిలిపేయడంతో పాటు, ఉక్రెయిన్ భూభాగంపై రష్యా సేనలు గానీ, దానికి మద్దతు ఇచ్చే సాయుధ దళాలు గానీ ఎటువంటి తదుపరి ఆపరేషన్లు చేపట్టకుండా చూడాలని స్పష్టం చేసింది. సైనిక చర్య కారణంగా పౌరులు కూడా బాధితులుగా మారుతున్నారని, ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేసింది. రష్యాపై వేసిన కేసు ఉక్రెయిన్ పూర్తి విజయం సాధించిందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఐసీజే ఇచ్చిన ఆదేశాలను రష్యా తక్షనం పాటించాలని, లేకుంటే మరింతగా ఏకాకి అవుతుందని అన్నారు.














