ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎనిమిదో రోజు ఇరు దేశాలు పరస్పరం క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది. ప్రతిగా క్లస్టర్ బాంబులతో కూడిన క్షిపణులను ఇజ్రాయెల్‌పైకి టెహ్రాన్ ఎక్కుపెట్టింది. రెండు దేశాల మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయుల తరలింపుకోసం ఇరాన్ తన గగనతలాన్ని తెరిచింది. ఈ చర్యతో అక్కడ చిక్కుకున్న దాదాపు 1,000 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి రానున్నారు. తొలి విమానం ఇవాళ రాత్రి 11 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ఢిల్లీలో ల్యాండ్ కానుంది. రెండు, మూడు విమానాలు శనివారం ఉదయం ఒకటి, సాయంత్రం మరొకటి స్వదేశానికి చేరనుంది. ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా భారతీయ విమానాలకు మాత్రమే తన గగనతలాన్ని తెరిచింది.
