త్రిగున్, రుబాల్ షేక్ రావత్ జంటగా నటిస్తున్న సినిమా అవసరానికో అబద్ధం. ఈ చిత్రాన్ని గ్లోబల్ ఎంపవర్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై డాక్టర్ జై యలమంచిలి నిర్మిస్తున్నారు. అయాన్ బొమ్మాళి దర్శకుడు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దామోదర్ కోలేటి తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో త్రిగుణ్ మాట్లాడుతూ దర్శకుడు ఆయాన్ చెప్పిన కథ చాలా విభిన్నంగా ఉండటంతో ఈ సినిమా చేస్తున్నా. ఇంత మంచి కథలో నటించే అవకాశమిచ్చినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు. దర్శకుడు అయాన్ బొమ్మాళి మాట్లాడుతూ మనిషి జీవితంలో అబద్ధానికి చాలా ప్రాముఖ్యత ఉందని సందేశాత్మకంగా చెప్పే చిత్రమిది. మహాభారతంలో శ్రీకృష్ణుడు కొన్ని సందర్భాల్లో అబద్ధం ఆడవచ్చు అని చెప్పాడు. ఆ మాటను ఆదర్శంగా తీసుకుని సినిమాటిక్‌గా కమర్షియల్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అన్నారు.