దిపిష్ అనే ప్రవాసుడు 14 ఏళ్ల నుంచి భార్య, కూతురితో కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో ఉంటున్నాడు. అతడు గ్రాఫిక్ డిజైనర్. స్థానికంగా ఉండే ఓ సూపర్ మార్కెట్ చైన్‌లో ఉద్యోగి. అయితే, స్నేహితుల సూచనతో గడిచిన కొన్నేళ్ల నుంచి మహజూజ్ డ్రాలో పాల్గొంటున్నాడు. దాంతో అప్పడప్పుడు కొన్ని చిన్న బహుమతులు కూడా వరించాయి. అయితే, మార్చి 11న నిర్వహించిన 119వ వారాంతపు డ్రాలో మనోడు జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా ఒక మిలియన్ దిర్హమ్స్ గెలిచాడు. అంతే రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారాడు. ఈ సందర్భంగా దిపిష్ మాట్లాడుతూ రోజులానే మార్చి 11వ తేదీ సాయంత్రం మెయిల్ చెక్ చేస్తున్నాను. ఇంతలో మహజూజ్ నుంచి వచ్చిన ఒక ఈ-మెయిల్ కనిపించింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే, మిలియన్ దిర్హమ్స్ గెలిచినట్లు ఉంది. మొదట అసలు నమ్మలేదు. వెంటనే భార్యను పిలిచి చూపించాను. ఆమె చూసి ఎగిరిగంతేసినంత పని చేసింది. దాంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిత్రులకు ఈ విషయం చెప్పి, మహజూజ్ అధికార వెబ్‌సైట్ ద్వారా నిజంగానే అంతా భారీ నగదు గెలిచానా? అని ధృవీకరించాల్సిందిగా కోరాను. వాళ్లు కూడా అది నిజమేనని చెప్పడంతో నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి అని చెప్పుకొచ్చాడు.