జమిలి ఎన్నికల దిశగా తొలి అడుగు పడింది. లోక్‌సభతో పాటు అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే దిశగా కీలక అడుగు పడింది. జమిలి ఎన్నికలకు వీలు కల్పించే రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అంతకుముందు బిల్లులు ప్రవేశపెట్టడంపై 90 నిమిషాల పాటు సభలో చర్చ జరిగింది. జమిలి బిల్లులను ప్రవేశపెట్టడం కోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఇచ్చిన తీర్మానంపై స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించగా 269 మంది జమిలి బిల్లులకు మద్దతునిచ్చారు. 198 మంది వ్యతిరేకించారు. దీంతో అర్జున్‌రామ్ మేఘ్వాల్ సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. ఇందులో ఒకటి రాజ్యాంగ(129వ సవరణ) బిల్లు కాగా, మరొకటి కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లు. ఈ బిల్లులను జేపీసీకి పంపుతూ బుధవారం తీర్మానం చేసే అవకాశం ఉంది.
దేశంలో జమిలి ఎన్నికల ఆలోచన ఇప్పటిది కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జమిలి ఎన్నికలపై కేంద్రం అధికారిక వివరణ ఇచ్చింది. రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన తర్వాత 1951-52, 1957, 1962, 1967లో లోక్‌సభ, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1968, 1969లో పలు రాష్ర్టాల అసెంబ్లీలు ఐదేండ్లకు ముందే రద్దు కావడం వల్ల జమిలి ఎన్నికలకు ఆటంకం ఏర్పడింది. 1970లో నాలుగో లోక్‌సభ కూడా ముందే రద్దు కావడంతో 1971లో ఎన్నికలు జరిగాయి. ఐదో లోక్‌సభ వ్యవధిని ఎమర్జెన్సీ కారణంగా 1977 వరకు పొడిగించారు.