నూతన సీజేగా జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్‌ను నియమిస్తూ సంబంధిత ఉత్తర్వులపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ సిఫార్సు తర్వాత సంబంధించి ప్రతిని కేంద్ర న్యాయశాఖ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపగా ఆమె ఆమోదించారని ఆ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు తెలిపారు. నవంబర్ 9న సుప్రీంకోర్టు జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం చేస్తారని రిజెజు తెలిపారు. అప్పటి నుంచి రెండు సంవత్సరాలపాటు అంటే 2024 నవంబర్ పదోతేదీ దాకా ఆయన సీజేఐగా కొనసాగుతారు. కొత్త సీజేగా నియామకపత్రాన్ని ప్రధాని ప్రధాన సలహాదారు పీకే మిశ్రా, న్యాయశాఖ ఉన్నతాధికారులు స్వయంగా జస్టిస్ చంద్రచూడ్‌కు అందజేశారు.
జస్టిస్ చంద్రచూడ్ 2016 మే 13న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. మరోవైపు సుప్రీంకోర్టు నియామకానికి ముందు న్యాయమూర్తి చంద్రచూడ్ 2013 అక్టోబర్ 31 నుంచి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2000 మార్చి నుంచి 2013 అక్టోబరు వరకు బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. అలాగే 1998 నుంచి 2000 వరకు అదనపు సొలిసిటర్ జనరల్‌గా ఆయన వ్యవహరించారు.