
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవిని అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఘనంగా సన్మానించింది. అమెరికాలో పర్యటిస్తున్న జస్టిస్ శ్రీదేవి, వర్జీనియాలో ఆటా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తన అనుభవాలను సభికులతో పంచుకున్నారు. కుటుంబ జీవితాన్ని, న్యాయవ్యవస్థలో వృత్తి జీవితాన్ని సమన్వయం చేస్తూ ప్రైవేటు న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, హైకోర్టు న్యాయమూర్తిగా ఎదిగిన విధానాన్ని వివరించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భారత న్యాయవ్యవస్థపై ప్రవాస తెలుగువారికి అవగాహన కల్పించారు. వచ్చే ఏడాది జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్‌లో జరిగే ఆటా 19వ కాన్ఫరెన్స్‌తోపాటు భారత్‌లో ఆటా నిర్వహించబోయే సమావేశానికి జస్టిస్ శ్రీదేవిని సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ట్రస్టీల బోర్డు సభ్యుడు విష్ణు మాధవరం తదితరులు పాల్గొన్నారు.















