ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఆధ్వర్యంలో కార్తిక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తిక మాస విశిష్టతను చాటిచెబుతూ తొలుత తులసి చెట్టు వద్ద పూజలు చేశారు. అనంతరం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వివిధ రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందినవారికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

వన భోజన మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చిన్నారులకు ప్రత్యేక ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తెలుగువారి ఐక్యత, సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. ఇకముందూ ఇలాంటివి కొనసాగించాలని కోరారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు అందరూ శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయ తెలుగు వంటకాలతో ఏర్పాటు చేసిన రుచికరమైన భోజనాలను ఆస్వాదిస్తూ వారంతా ఆత్మీయంగా గడిపారు.























