బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎన్నారై గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల మర్యాదపూర్వకంగా కలిశారు. అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కావడంలో కీలక భూమికను పోషించినందుకు మహేశ్ బిగాలను కేసీఆర్ అభినందించారు. పార్టీ రజతోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎన్నారై శాఖలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

సభ విజయవంతంపై ఆనందం వ్యక్తం చేస్తూ, మహేష్ బిగాలను కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. సుదూర అమెరికాలో దేశభక్తితో, పార్టీ పట్ల అపారమైన అంకితభావంతో ఇంత భారీ సభను విజయవంతంగా నిర్వహించడం గొప్ప విషయం. ఇది మీ త్యాగానికి, సమర్పణకు నిదర్శనం. విదేశాల్లో ఉన్న మన ఎన్నారైలు ఇప్పుడు బీఆర్ఎస్ ఆశయాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారని కేసీఆర్ అన్నారు.

మహేష్ బిగాల మాట్లాడుతూ డల్లాస్ సభను చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై బీఆర్ఎస్ శ్రేణుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, లండన్ వంటి దేశాలు రజతోత్సవ సభలు నిర్వహించేందుకు తమ ఆసక్తిని తెలియజేశాయని వెల్లడించారు.
