
టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందుతున్న ఓ యాక్షన్ ఎంటర్టైనర్లో కీర్తి సురేష్ హీరోయిన్గా ఎంపికైనట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో తుపాకీ ఫేమ్ విద్యుత్ జమ్వాల్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందే ఈ సినిమాతో కీర్తి హిందీలో తన స్థానం మరింత బలపర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించిన తర్వాత కీర్తి కొంతకాలం సినిమాలకు విరామం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతోంది. తెలుగు లో విజయ్ దేవరకొండతో కలిసి రౌడీ జనార్ధన చిత్రంలో నటిస్తుండగా, తమిళం, మలయాళంలో కూడా కొత్త సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. అంతేకాదు, ఈ ఏడాది హిందీ వెబ్ సిరీస్ అక్కలో కూడా ఆమె కనిపించనుంది.















