ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకునేందుకు నెల రోజులుగా రష్యా ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవడమనేది అనుకున్నంత సులభం కాదని రష్యా నిర్ధారణకొచ్చినట్లు తెలుస్తోంది. అయినా పట్టువీడకుండా అత్యాధునిక ఆయుధాలను సైతం రష్యా ఉపయోగిస్తోంది. ఉక్రెయిన్పై దండయాత్ర కొనసాగుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 20 రోజుల తర్వాత తొలిసారి జరిగిన ప్రత్యక్ష శాంతి చర్చల్లో పురోగతి చోటు చేసుకుంది. అయితే ఇదంతా ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు ఇస్లాంబుల్లో జరిగిన ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి చర్చల్లో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. శాంతి చర్చల్లో విశ్వాసాన్ని పెంచడానికి కీవ్, చెర్నీవ్ నుంచి బలగాలను వెనక్కి తీసుకుంటామని రష్యా ప్రకటించింది. పరస్పర విశ్వాసం, తదుపరి చర్చలు జరగడానికి అవసరమైన పరిస్థితుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార అలెగ్జాండర్ ఫోమిన్ తెలిపారు. రష్యా ప్రతినిధి బృందం మాస్కోకు తిరిగొచ్చిన తర్వాత ఇస్తాంబుల్లో చర్చించిన విషయాలు, తీసుకున్న నిర్ణయాలను మరింత విపులంగా వెల్లడిస్తామని రష్యా జనరల్ స్టాఫ్ ఫోమిన్ తెలిపారు.
కాగా, టర్కీలోని ఇస్తాంబుల్లో మూడు గంటలపాటు రష్యా, ఉక్రెయిన్ చర్చలు సాగిన తర్వాత ఈ అంగీకారం కుదిరింది. ఈ నెల 10 తర్వాత ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన తొలిసారి చర్చలు ఇవే కావడం గమనార్హం. అంతకుముందు పలుమార్లు జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగియగా ఈ రోజు ఇరు దేశాల ప్రతినిధులు ఇస్తాంబుల్లో చర్చలు జరిపారు.