కెనడా ప్రధానమంత్రి పదవికి, అధికార లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా అధినేత పదవికి రాజీనామా చేస్తున్నట్టు జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఒట్టావాలోని తన నివాసం వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాను రాజీనామా చేస్తానని తన పార్టీకి, గవర్నర్‌కు తెలియజేసినట్టు తెలిపారు. కొత్త ప్రధాని ఎన్నిక వరకు తాను ఈ పదవుల్లో కొనసాగు తానని చెప్పారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల వరకు పార్టీని, కెనడాకు నాయకత్వం వహించే కొత్త నేత ఎన్నిక ప్రక్రియను ప్రారంభించేందుకు వీలుగా జనవరి 27న ప్రారంభం కావాల్సిన పార్లమెంటును మార్చి 24 వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
నేను ఏ పోరాటం నుంచి అంత సులువుగా వెనక్కు తగ్గను. కానీ, కెనడియన్ల ప్రయోజనాలు, నేను ప్రేమించే ప్రజాస్వామ్య శ్రేయస్సు కోసం రాజీనామా చేస్తున్నాను అని ట్రూడో వ్యాఖ్యానించారు. కెనడాలో అధికార పార్టీ అధినేత రాజీనామా తర్వాత కొత్త నాయకుడి ఎన్నికకు 90 రోజుల గడువు ఉంటుంది. ఈ నేపథ్యంలో తొమ్మిదేండ్ల జస్టిన్ ట్రూడో పాలనకు మరో 90 రోజుల్లోపే తెరపడనుంది.