ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన వింత చర్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. కిమ్ జోంగ్ ఉన్ తర్వాత ఆయన కుమార్తె కిమ్ జు యే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. రెండేళ్ల క్రితం బహిరంగంగా కనిపించిన ఆమె తాజాగా మళ్లీ కనిపించారు. తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల సమాధులు ఉండే ప్రదేశం కుమ్‌సుసన్ స్మారకాన్ని ఆమె సందర్శించింది.

గత మూడేళ్ల నుంచి తండ్రి కిమ్‌జోంగ్ ఉన్‌తో పాటు కిమ్ జు యే వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. కిమ్ తన కుమార్తెను అధికారిక పర్యటనలకు తీసుకువెళ్తుండడంతో, భవిష్యత్తులో అధికారిక పగ్గాలు ఆమెకే అందించనున్నట్లు పరోక్షంగా సంకేతాలను పంపుతున్నారని దక్షిణ కొరియా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దేశ మాజీ నాయకులకు కిమ్ జోంగ్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి కిమ్‌తో పాటు అయన సతీమణి రి సోల్ జు, కుమార్తె కిమ్ జు యే, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.















