అమెరికాలోని ఫిలడెల్ఫియాలో భారత సంతతి విద్యార్థులు కూచిపూడి నృత్య ప్రదర్శనతో అలరించారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కూచిపూడి సంస్థలో శిక్షణ పొందిన టెక్సాస్, కాలిఫోర్నియా, ఆరిజోనా, ఇల్లినోయీ, పెన్సిల్వేనియా రాష్ట్రాల విద్యార్థులు ఫిలడెల్ఫియాలోని వెస్ట్ చెస్టర్ ఈస్ట్ హై స్కూల్ లో నిర్వహించిన కూచిపూడి ప్రదర్శనలో పాల్గొన్నారు.


ఈ కార్యక్రమాన్ని ఇండియన్ కాన్సులేట్ ప్రెస్ అండ్ కల్చర్ అధినేత హెచ్.ఈ. పీయూష్ సింగ్ ప్రారంభించారు.
ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కూచిపూడి వ్యవస్థాపకురాలు, ప్రఖ్యాత కళాకారిణి భావనా రెడ్డి వద్ద విద్యార్థులు కొన్నేళ్లు గా వర్చువల్‌గా శిక్షణ పొందారు. ఈ కార్యక్రమంలో వారు ఆమెతో కలిసి ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా భావన రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రదర్శన భారతీయ కళల పట్ల విదేశీయుల్లో ఆసక్తిని కలిగించడానికి సహాయపడుతుందని అన్నారు. తమ విద్యార్థులు ఎంతో శ్రద్ధ, నిబద్ధతతో ఈ ప్రదర్శనలో పాల్గొన్నట్లు వెల్లడిరచారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 14న యూట్యూబ్‌లో ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.


ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కూచిపూడి సంస్థను 2020లో భావనా రెడ్డి స్థాపించారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు డాక్టర్ రాజా, రాధా రెడ్డి దంపతుల కుమార్తే భావన. తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగించేందుకు, కూచిపూడిని మరింత ప్రచారం చేసేందుకు ఈ సంస్థను స్థాపించారు. అమెరికా, బహమాస్, కెనడా, ఐరోపా, యూఏఈ, భారత్‌లోని 30 మంది సభ్యులు దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.















