శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సూధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. దర్శకుడు సుకుమార్, నాయికలు సాయిపల్లవి, కీర్తి సురేష్ అతిథులుగా హాజరై చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ ఈ వేదిక మీదున్న సాయిపల్లవి, కీర్తి సురేష్, రష్మిక అంతా మంచి ప్రతిభ గల నాయికలు. సమంత వీళ్లకు గ్యాంగ్‌లీడర్ లాంటిది. సాయిపల్లవిని చూస్తే లేడీ పవన్ కల్యాణ్‌లా అనిపిస్తుంటుంది. శర్వానంద్ గత రెండు చిత్రాల్లో సీరియస్ రోల్స్ చేశారు. ఈ చిత్రంలో నవ్వుతూ కనిపిస్తున్నాడు. అదే హిట్ కళను చూపిస్తున్నది అన్నారు.
అనంతరం హీరో శర్వానంద్ మాట్లాడుతూ కుటుంబ కథతో సినిమా చేయకపోవడం లోటుగా ఉండేది. అది ఈ సినిమాతో తీరిపోయింది. నమ్మకంగా చెప్పగలను ఈ సినిమా నా నట ప్రయాణంలో గుర్తుండిపోయే చిత్రమవుతుంది. సినిమా చూసి ఆనందంగా బయటకొస్తారు. రష్మికతో కలిసి నటించడాన్ని ఆస్వాదిచాను. మాకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఇక్కడికొచ్చిన దర్శకుడు నాతో హిట్ సినిమా చేద్దామని మాటిచ్చాడు. ఆయన అన్నట్లే బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చాడు అని అన్నారు. సాయి పల్లవి మాట్లాడుతూ పుష్ఫ సినిమాతో రష్మికకు దక్కిన విజయం ఈ సినిమాతో ఆమెకు రావాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు నవీన్ యేర్నేని, వెంకట్ బోయినపల్లి, నాగవంశీ, నటి ఖుష్భూ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. మార్చి 4న సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.














