ప్రజల ప్రాణాలను కాపాడే సరికొత్త కార్యక్రమానికి అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఏపీటీఏ) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా స్టెమ్ సెల్ దాతల నమోదు డ్రైవ్‌లను ప్రారంభించింది. దక్షిణ ఆసియా మూలాలున్న స్టెమ్ సెల్ దాతల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోనే లుకేమియా, ఇతర బ్లడ్ క్యాన్సర్ వంటి రోగాలను దీటుగా ఎదుర్కొనేందుకు ఏటా దాదాపు 15 వేల మంది రోగులకు సరిపోలే స్టెమ్ సెల్ దాతల అవసరం ఉందని ఏపీటీఏ తెలిపింది. దక్షిణాసియాకు చెందిన రోగులకు మ్యాచ్ అయ్యేదాతల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం కీలకంగా మారిందని పేర్కొంది.

ప్రాణాలను కాపాడే సంకల్పంతో చేపట్టిన ఈ మిషన్ అమెరికాలో 8 వేలకు పైగా ఏపీటీఏ కుటుంబాలను బలోపేతం చేయనుండటం గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు. అట్లాంటాలో గ్లోబల్ స్టెమ్ సెల్ రిజిస్ట్రీ అయిన డీకేఎంఎస్‌తో కలిసి ఏపీటీఏ చేప్టిన ఈ స్టెమ్ సెల్ డోనార్ రిజిస్ట్రేషన్ల డ్రైవ్‌లను ప్రముఖ గాయని సునీత, ఏపీటీఏ అధ్యక్షుడు మధు వుల్లి అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ ట్రెజరర్ వెంకట శివ గోక్యాడ, జాయింట్ సెక్రటరీ ప్రియాంక గడ్డం, ధీరజ్ కడియాల, ఐశ్వర్య పాల్గొన్నారు.















