విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన చిత్రం జోరుగా హుషారుగా. పూజిత పొన్నాడ హీరోయిన్. అను ప్రసాద్ దర్శకత్వం లో నిరీశ్ తిరువీధుల నిర్మించారు. ఈ నెల 15న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా హాజరైన మల్లిడి వశిష్ట మాట్లాడుతూ కొత్త దర్శకుడిని నమ్మి సినిమా ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. విరాజ్ ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకోబోతున్నారు. బెక్కం వేణుగోపాల్ గారిని అందరూ సేవియర్ అంటున్నారు కానీ ఆయన ఓ వారియర్. కొత్త దర్శకులను, కథలను ఆయన ప్రోత్సహిస్తారు అన్నారు.
నటుడు సాయికుమార్ మాట్లాడుతూ ఇందులో నేను చేనేత కార్మికుడిగా నటించాను. పోచంపల్లి చేనేత కార్మికుల గురించి ఈ చిత్రంలో చక్కగా చూపించారు. ఇదొక గ్రేట్ కాన్సెప్ట్ ఈ వారం విడుదలవుతున్న సినిమాలన్నీ ఆడాలి. అందులో మన సినిమా ఉండాలి అని కోరారు. విరాజ్ మాట్లాడుతూ ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో చేనేత కార్మికుల గురించి ఓ స్పెషల్ సాంగ్ చేశాం. చేనేత కార్మిక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఇందులో నేను నటించాను. నా పాత్ర తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుంది అన్నారు. ఉగాది పచ్చడిలాంటి సినిమా ఇదని పూజిత చెప్పారు. కామెడీ, ఎమోషన్స్, యూత్‌ఫుల్ రొమాన్స్ అన్నీ ఉన్నాయని తెలిపారు. ఇదే తనకు తొలి సినిమా అనీ, అయితే ఐదు సినిమాలకు పనిచేసిన అనుభవం ఈ ఒక్క చిత్రంతోనే వచ్చిందని దర్శకుడు అను ప్రసాద్ చెప్పారు.














