అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ మేజర్. శోభితా దూళిపాల, సయీ మంజ్రేకర్ నాయికలుగా నటిస్తున్నారు. ముంబై ఉగ్రదాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది.హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌ను హీరో, నిర్మాత మహేష్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా మశేష్ బాబు మాట్లాడుతూ ఈ సినిమా నిర్మించినందుకు గర్వంగా ఉంది. ఇందాక దర్శకుడు అన్నట్లు ప్రజలకు చూపించాల్సిన సినిమా ఇది. కొన్ని సన్నివేశాల్లో గూస్‌బంప్స్ వచ్చాయి. చివరి అరగంట ఉద్వేగంగా అనిపించింది. సినిమా పూర్తయ్యాక ఆ ఎమోషన్‌లో కాసేపు మౌనంగా ఉండిపోయాను. ఇలాంటి మరుపురాని సినిమా నా సంస్థకు ఇచ్చినందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు చెబుతున్నా అన్నారు.
అడివి శేష్ మాట్లాడుతు గొప్ప వ్యక్తుల జీవితాల్లో కూడా మనలాంటి భావోద్వేగాలే ఉంటాయి. మేజర్ సందీప్ ఉన్నికృష్నన్ జీవితం కూడా మనలా సాధారణమైనదే. ఆయన లైఫ్‌లో అమ్మా, నాన్న, ప్రేయసి, స్నేహితులు ఇలాంటి వాటికే ప్రాధాన్యత ఉండేవి. మేజర్ సందీప్ ఈ దేశపు ముద్దుబిడ్డ. మేజర్ సందీప్ జ్ఞాపకాలు ఈ చిత్రంతో మిగిలిపోవాలి. అది అతని త్యాగానికి మనమిచ్చే గౌరవం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయిక సయీ మంజ్రేకర్, దర్శకుడు శశికిరణ్, రచయిత అబ్బూరి రవి తదితరులు పాల్గొన్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్ ఇండియా సంస్థలు సంయుక్తగా నిర్మిస్తున్నాయి. శేష కథ స్క్రీన్‌ప్లే అందించిన చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమా జూన్ 3న విడుదల కానుంది.














