Namaste NRI

112 ఏళ్ల నుంచి తప్పనిసరి… బెల్జియం తర్వాత అర్జెంటీనానే

ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రజాస్వామ్య దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో ప్రజలు ఓటు ద్వారా తమ పాలకుల ను ఎన్నుకుంటున్నారు. అయితే భారత్‌తో సహా పలు దేశాల్లో తప్పనిసరి ఓటింగ్‌ నిబంధన లేదు. దాంతో కేవలం 60 నుంచి 70 శాతం ప్రజలు మాత్రమే పాలకులు ఎవరనేది నిర్ణయిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో పౌరులకు తప్పనిసరి ఓటింగ్‌ నిబంధనను తీసుకొచ్చిన దేశాల్లో అర్జెంటీనా ఒకటి. బెల్జియం తర్వాత అర్జెంటీ నానే ఓటింగ్‌ను తప్పనిసరి చేసింది. ఆ దేశంలో దాదాపు 112 ఏళ్ల నుంచి ఈ చట్టం నిరంతరాయంగా అమలవుతోంది. అర్జెంటీనాలో 1912 నుంచి ఓటింగ్‌ను తప్పనిసరి చేశారు. అప్పట్లో పురుషులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. మహిళలకు ఉండేది కాదు. అయితే 1947లో మహిళలకు కూడా ఓటుహక్కు కల్పించారు. 1951 ఎన్నికల నుంచి అక్కడి మహిళలు కూడా తమ నాయకుడిని ఎన్నుకుంటున్నారు.

అర్జెంటీనా పాలకులు 2012లో ఓటింగ్‌లో పాల్గొనే ఓటరు వయోపరిమితిని తగ్గించారు. 16 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు వాళ్లకు కూడా ఓటు వేసే అవకాశం ఇచ్చారు. కానీ వారు తప్పనిసరిగా ఓటుహక్కు వినియోగించు కోవాలనే నిబంధన లేదు. ఇక 18 నుంచి 70 ఏళ్ల వారు కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి అక్కడ మూడు రకాల శిక్షలు అమల్లో ఉన్నాయి. ఓటు వేయనివారు ముందుగా 60 రోజుల్లో తమ సహేతుక కారణాలను వెల్లడించాలి.

ఓటర్లు చెప్పే కారణాలు నమ్మలేనివిగా ఉంటే మాత్రం 5 నుంచి 50 డాలర్ల వరకు జరిమానా చెల్లించాలి. కానీ చట్టంలో ఈ నిబంధన ఉన్నా అమలు చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఓటు వేయని వాళ్లు మూడేళ్ల పాటు ప్రభుత్వ పదవుల్లో ఉండకుండా నిషేధం లాంటి ఆంక్షలు కూడా ఉన్నాయి. అయితే అర్జెంటీనా వీటిని అమలు చేయడం లేదు. ఫలితంగా అక్కడ కూడా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ సుమారు 71 శాతం ఉంటోంది. అర్జెంటీనాలో తప్పనిసరి ఓటింగ్‌ విధానం ఉన్నా అమలు కాకపోవడానికి పాలకులే కారణం.

1930-32, 1976-83 మధ్య కాలంలో నియంతలు అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో ఎన్నికలే లేవు. నియంతల పాలనకు ముందూ వెనుక ఎన్నికలు జరిగినా ఓటు వేయని వారిపై చట్టంలో పేర్కొన్నట్టుగా చర్యలు తీసుకోలేదు. దానివల్లే ఇప్పటికీ అక్కడ తప్పనిసరి ఓటింగ్‌ నిబంధన అమలు కావడంలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events