డిఫరెంట్ చిత్రాలు, విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయంలో నటించిన చిత్రం అమిగోస్. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ నటించిన ధర్మక్షేత్రం చిత్రంలోని ఎన్నో రాత్రులొస్తాయిగానీ పాట చక్కటి మెలోడీగా సంగీత ప్రియుల హృదయాల్ని దోచుకుంది. ఇళయరాజా సంగీతం, బాలసుబ్రహ్మణ్యం గాత్రం ఆ పాటకు ప్రాణం పోశాయి. ఈ పాటను అమిగోస్లో రీమిక్స్ చేశారు. ఈ సినిమాలోని ఎన్నో రాత్రులొస్తాయిగానీ.. రీమిక్స్ గీతాన్ని విడుదల చేశారు. కల్యాణ్రామ్, ఆషికా రంగనాథ్ మధ్య అందమైన రొమాంటిక్ మెలోడీగా ఈ పాటను దృశ్యమానం చేశారు. ఎస్పీ చరణ్, సమీర భరద్వాజ్ ఆలపించారు. కనులవిందైన విజువల్స్తో ఈ పాట సినిమాలో ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
