ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృసంస్థ అయిన మెటా చిక్కుల్లోపడింది. ఐటీ దిగ్గజం అతిపెద్ద యాంటీ ట్రస్ట్ ట్రయల్స్‌ను ఎదుర్కోనున్నది. దాదాపు 37 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనున్నది. యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ మెటా కంపెనీకి ప్రశ్నలు సందించబోతున్నది. మార్కెట్‌లో గుత్తాధిపత్యం ఆరోపణలపై ఫెడరల్ ట్రేడ్ కమిషన్ విచారించనున్నది. మెటా దిగ్గజం దశాబ్దం కిందట ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు ఆ కంపెనీకి అతిపెద్ద వ్యాపార స్తంభాలుగా నిలిచాయి. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను విక్రయించాలంటూ కంపెనీపై ట్రేడ్ కమిషన్ ఒత్తిడి తెచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.

వాస్తవానికి పోటీలో లేకుండా తప్పించేందుకు దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ని మెటా కొనుగోలు చేసిందని, సోషల్ మీడియాలో ఏకఛత్రాధిపత్యం కోసం మెటా కంపెనీ ప్రయత్నించినట్లుగా ట్రేడ్ కమిషన్ ఆరోపించింది. ఈ సందర్భంగా కొన్ని అంతర్గత మెయిల్స్‌ను కమిషన్ ప్రస్తావించింది. మెయిల్స్‌లో పోటీ కంటే కొనుగోలు చేయడం ఉత్తమం అనేది మార్క్ జుకర్‌బర్గ్ వ్యూహమని, ఈ విషయాన్ని మెయిల్‌లో ప్రస్తావించారని, ఫేస్‌బుక్ తనకు ముప్పు కలిగించే కంపెనీలను కొనుగోలు చేసిందని, ఈ ప్లాన్ కింద మొదట ఇన్‌స్టాగ్రామ్, ఆపై వాట్సాప్‌ను కొనుగోలు చేసినట్లుగా ఆరోపించింది. దీన్ని బట్టి వారి వ్యూహం ఏంటో అర్థమవుతుందని కమిషన్ అభిప్రాయపడింది.
