యూకే రాజధాని లండన్ వలస వ్యతిరేక నిరసనలతో హోరెత్తిపోయింది. యునైట్ ద కింగ్‌డమ్ పేరుతో యాంటీ ఇమిగ్రెంట్, యాంటీ ఇస్లాం కార్యకర్త టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరిగిన ర్యాలీలో లక్ష మందికిపైగా పాల్గొన్నారు. ప్రధాని కీర్ స్టార్మర్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. వలసదారులను బ్రిటన్ నుంచి పంపించేయాలనే నినాదాలతో ప్లకార్డులు ధరించారు. ఈ ర్యాలీలో దాదాపు 1.10 లక్షల నుంచి 1.50 లక్షల మంది పాల్గొన్నారని మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు. యూకేలో ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద ప్రదర్శనల్లో ఇది ఒకటని చెప్పారు.

రాబిన్‌సన్ నాయకత్వంలోని యునైట్ ది కింగ్‌డమ్ మార్చ్‌కు సమాంతరంగా, స్టాండ్ అప్ టు రేసిజమ్ అనే కౌంటర్-ప్రొటెస్ట్ జరిగింది. ఈ ప్రదర్శనలో సుమారు 5 వేల మంది పాల్గొన్నారు. ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా నిరోధించేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు ప్రదర్శనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనల్లో 26మంది అధికారులు గాయపడ్డారని, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. 25 మంది ఆందోళనకారులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
















