Skip to main content

Namaste NRI

అమెరికాలో భారీ వరదలు.. బాపట్ల యువకుడు గల్లంతు

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువకుడు అక్కడ సంభవించిన భారీ వరదల్లో గల్లంతయ్యాడు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన దొప్పలపూడి రాంబాబు, అనురాధ దంపతులకు ఇద్దరు కుమారులు. వారి పేర్లు వెంకటేశ్, రామకృష్ణ. పెద్ద కుమారుడైన వెంకటేశ్‌ ఉన్నత చదువుల నిమిత్తం మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ ఎంఎస్‌ పూర్తి చేసిన ఆయన, ప్రస్తుతం మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు.

అయితే అమెరికాలోని కాన్సాస్‌ రాష్ట్రంలో భారీ వర్షాలు, ఊహించని రీతిలో వరదలు ముంచెత్తాయి. ఈ క్రమంలో వెంకటేశ్‌ వరద నీటిలో గల్లంతైనట్లు తెలుస్తోంది. ఆయన ప్రయాణించిన కారు, అందులోని బ్యాగును స్థానిక అధికారులు గుర్తించారు. కానీ కారులో వెంకటేశ్‌ లేకపోవడం, ఆయన మొబైల్ ఫోన్ కూడా పనిచేయకపోవడంతో వరద ఉద్ధృతికి కొట్టుకుపోయి ఉంటారని బంధువులు అనుమానిస్తున్నారు. కారు దొరికినా వెంకటేశ్‌ ఆచూకీ లభించకపోవడంతో దేవరపల్లిలోని ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

ఈ విషయం స్థానిక పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అమెరికాలోని తెలుగు సంఘాలు, అధికారులతో మాట్లాడి యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందించేందుకు, అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు ఏలూరి సాంబశివరావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌లకు లేఖలు రాశారు. అమెరికాలోని కాన్సాస్ అధికారులతో ఉన్నత స్థాయిలో మాట్లాడి, ప్రత్యేక బృందాల ద్వారా వెంకటేశ్‌ ఆచూకీని త్వరగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖల్లో ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events