Namaste NRI

తెలుగు మహిళలకు మాస్టర్ ఇన్వెంటర్ అవార్డ్

ప్రపంచవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ ఓ కొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచంలో కొన్ని దేశాలకు పరిచయమైన ఈ టెక్నాలజీ త్వరలో భారత్‌లోనూ అందుబాటులోకి రానుంది. కానీ ఈ 5జీ టెక్నాలజీ అభివృద్ధి  చేసిన డెవలప్మెంట్‌ టీమ్‌లో మన తెలుగింటి ఆడపడుచు కీలక పాత్ర పోషించింది. 5జీని ప్రపంచానికి పరిచయం చేసిన వెరైజన్‌ ఆర్కిటెక్ట్‌లలో డాక్టర్‌ కల్యాణి బోగినేని ఒకరు. ఆ కంపెనీలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం వారి కంపెనీ నుంచి ఇచ్చే ప్రతిష్ఠాత్మక వెరైజన్‌ మాస్టర్‌ ఇన్వెంటర్‌ అవార్డును 2021 సంవత్సరానికి గాను ఆమెకు ప్రకటించారు.  అమెరికాలోని నెట్‌వర్క్‌ టెక్నాలజీ రంగంలో ఈ తరహా అవార్డులు మహిళలకు రావడం చాలా అరుదు.  తెలుగు మహిళలు, భారతీయ మహిళలు పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో రాణిస్తున్నప్పటికీ నెట్‌వర్క్‌ టెక్నాలజీ రంగంలో ఇటువంటి అవార్డు రావడం గర్వకారణం.

                         ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని అయిన డాక్టర్‌ కల్యాణిని ఆమె సహచరులు, అధ్యాపకులు వర్చువల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అభినందించారు. ఆ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో కల్యాణి 1982లో బీటెక్‌ (ఈఈఈ) విద్యను పూర్తి చేశారు.  1984లో ఐఐఎస్‌సీ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో ఎంఈ పూర్తి చేశారు.  డార్ట్‌మౌత్‌ కాలేజీ నుంచి ఫెలోషిప్‌ అందుకున్నారు. 1990లో ఇంజనీరింగ్‌ సైన్సెస్‌లో డార్ట్‌ మౌత్‌ నుంచి ఎంఎస్‌ పట్టా అందుకున్నారు.  1993లో స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ ఎట్‌ బఫెలో నుంచి ఎలక్ట్రికల్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. పీహెచ్‌డీ సమయంలో 20కి పైగా ఐఈఈఈ/ఎసీఎం పత్రాలను సమర్పించారు. ప్రస్తుతం అమెరికాలోని తెలుగు వారు డాక్టర్‌ కల్యాణిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Social Share Spread Message

Latest News