ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ డివైసెస్ తయారీ కంపెనీ కన్ప్లూయెంటు మెడికల్ కంపెనీ హైదరాబాద్‌లో తన యూనిటును ఏర్పాటు చేయనుంది. పైలట్ ప్రాతిపదికన ఒక తయారీ యూనిట్‌ను మొదలు పెట్టి 12 నెలల్లో దాని భారీగా విస్తరించేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తుల తయారీ కోసం నిటినోల్ వంటి అగ్రశ్రేణి సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్ నగరానికి తీసుకురానుంది. కంపెనీ మెడికల్ సంస్థ అధ్యక్షులు, చైర్మన్, సీఈవో డీన్ షావర్ అమెరికాలోని శాన్ హోనగరంలో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన సందర్భంగా తమ సంస్థకు సంబంధించిన యూనిట్ ఏర్పాటు ప్రకటన చేశారు. భారతదేశానికి తొలిసారిగా అత్యంత ఆధునాతన టెక్నాలజీని తీసుకురావాలన్న లక్ష్యంతో హైదరాబాద్ నగరాన్ని తమ గమ్యస్థానంగా ఎంచుకున్నామని, భవిష్యత్తులో తమ కంపెనీని భారీగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామని చెప్పారు. త్వరలోనే తమ కంపెనీ బయోమెడికల్ టైక్స్‌టైల్ సేవలకు సంబంధించి విధివిధానాలను ప్రకటిస్తామని తెలిపారు.
తమ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్న కన్ప్లూయెంట్ మెడికల్ టెక్నాలజీ సంస్థకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తరపున తయారీ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. భవిష్యత్తులో సంస్థతో తెలంగాణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పని చేద్దామని మంత్రి కేటీఆర్ అన్నారు.