ఉక్రెయిన్, రష్యా సంక్షోభంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతుండగానే మరోవైపు టర్కీలో రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రులు సెర్గీ లావ్రోవ్, దిమిత్రో కులేబాలు భేటీ అయ్యారు. ప్రస్తుత వివాదానికి ముగింపు పలికేందుకు టర్కీ దౌత్య ప్రయత్నాల ఫలితంగా ఇరు దేశాల మంత్రులు ఈ కీలక చర్చలకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు టర్కీలోని అంటల్యా డిప్లమసీ ఫోరం వేదికగా ఇరు పక్షాలు సమావేశమయ్యాయి. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు మొదలు పెట్టినప్పటి నుంచి ఇదే మొదటి అత్యున్నత స్థాయి సమావేశం కావడం గమనార్హం.
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా మాట్లాడుతూ మేం 24 గంటలపాటు కాల్పుల విరమణపై చర్చించాం. కానీ ఈ దిశగా ఎటువంటి పురోగతి సాధ్యపడలేదన్నారు. మేరియపొల్‌లో మానవతా కారిడార్‌ల ఏర్పాటుపై సానుకూల ఫలితం వస్తుందని భావించా. దీనికి సంబంధించి లావ్రోవ్ సరైన హామీ ఇవ్వలేదు అని తెలిపారు.














