
చిరంజీవి కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న చిత్రం షూటింగ్, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర కథానాయకుడు వెంకటేష్ క్లాప్ ఇవ్వగా, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచాన్ చేశారు. డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. హ్యూమర్ అండ్ హై ఎనర్జీతో కంప్లీట్ యాక్షన్ ఎంటైర్టెనర్‌గా ఈ సినిమా ఉంటుందని తెలుస్తున్నది. చిరంజీవిని వినూత్నంగా డైనమిక్ అవతార్‌లో ప్రజెంట్ చేసేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా స్క్రీన్‌ప్లేని రాశారు. నవ్వులు, భావోద్వేగాల సమ్మేళనంగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో మెగాస్టార్ పాత్ర పేరు శంకర్ వరప్రసాద్. ఆయన అసలు పేరు కూడా అదే కావడం విశేషం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు ఇంకా ఎంపిక కాని ఈ సినిమాకు కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: శ్రీమతి అర్చన, నిర్మాణం: షైన్ స్క్రీన్స్ అండ్ గోల్డ్‌బాక్స్ ఎంటైర్టెన్మెంట్స్.
