ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా మరిన్ని ఉద్యోగాల్లో కోత పెట్టనున్నట్టు తెలిసింది. గత నవంబర్‌లో 11 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన ఆ సంస్థ మరికొంత మందిని తీసివేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వ్యయ నియంత్రణలో భాగంగా మరో 10 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
మెటా పరిధిలో ఉన్న ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, వర్చువల్ రియాలిటీపై పనిచేస్తున్న రియాలిటీ ల్యాబ్ ఇలా అన్ని వ్యాపారాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని చూస్తున్నది. ఇప్పటికే ఈ మేరకు మేనేజర్లకు సమాచారం పంపినట్టు తెలిసింది. మార్చిలోనే సీఈవో మార్క్ జూకర్‌బర్గ్ ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. అన్ని విభాగాల్లో సిబ్బంది కూర్పును సమీక్షించి కంపెనీ సామర్థ్యాన్ని మరింత పెంచాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. అందులో భాగంగానే ఈ లేఫ్‌లు ప్రకటిస్తున్నట్టు తెలుస్తున్నది.