కార్పొరేట్ సంస్థల్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ (సీఈఓ)లు అత్యంత కీలకం. వ్యూహ రచనలోనూ, ఆదాయం పెంపులోనూ, సిబ్బంది పనితీరు మెరుగు పర్చడంతోపాటు సాధక బాధకాలు తీర్చడంలోనూ సీఈఓలే కీలకం. ఇక ఐటీ, టెక్ సంస్థల సీఈఓలైతే వేరే చెప్పనక్కర్లేదు. సంస్థ పురోగతి సాధించడంలో ఎంతో ముఖ్య భూమిక పోషించే సీఈఓల వేతన భత్యాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కంపెనీ షేర్లు లాభపడే కొద్దీ వారి జీత భత్యాలు కూడా అదేస్థాయిలో పెరుగుతుంటాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వేతనం భారీగా పెరిగింది.
2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన వేతనం 79.1 మిలియన్ డాలర్లకు చేరింది. ఇది మన భారత కరెన్సీలో రూ.664 కోట్లతో సమానం. 2023 ఆర్థిక సంవత్సరంలో ఆయన 48.5 మిలియన్ డాలర్లు అందుకోగా, దాంతో పోలిస్తే ఇది 63 శాతం అధికం. జూన్‌లో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ వృద్ధిలో దూసుకెళ్లింది. దాంతో కంపెనీ షేర్లు సుమారు 31.2 శాతం లాభపడ్డాయి. ఈ కారణంగా మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్లను అధిగమించింది. ఫలితంగా, నాదెళ్ల స్టాక్ అవార్డులు 39 మిలియన్ డాలర్ల నుంచి 71 మిలియన్ డాలర్లకు పెరిగాయి.