బ్రిటన్‌లో తొలి దళిత మహిళా మేయర్‌గా భారత సంతతికి చెందిన ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత, కౌన్సిలర్ మొహీందర్ కె. మిధా ఘనతను దక్కించుకున్నారు. మొహిందర్ కె.మిథా పశ్చిమ లండన్‌లోని ఈలింగ్ కౌన్సిల్ మేయర్‌గా ఎన్నికయ్యారు. లండన్‌లో తొలి దళిత మహిళా మేయర్‌గా రికార్డుకెక్కారు. వచ్చే ఏడాదికి (2022`23)కి గాను, ఆ పదవికి ఆమెను కౌన్సిల్ సమావేశంలో ఎన్నుకున్నారు. ఆమె ఎన్నిక పట్ల లేబర్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇది తమకు గర్వకారణమని యూకేలోని ఫెడరేషన్ ఆఫ్ అంబేడ్కరైట్, బుద్దిస్ట్ ఆర్గనైజేషన్ చైర్మన్ సంతోష్‌దాస్ తెలిపారు. లండన్‌లో ఈ నెల 5న నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో ఈలింగ్ కౌన్సిల్‌లోని డార్మెర్ వెల్స్ వార్డుకు లేబర్ పార్టీ కౌన్సిలర్‌గా మేధ మరోసారి ఎన్నికయ్యారు. ఇంతకుముందు ఆమె డిప్యూటీ మేయర్‌గా కూడా పని చేశారు.
