ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇజ్రాయెల్‌కు తీవ్ర హెచ్చరిక చేశారు. ఇరాన్ సైనిక దళాల వార్షిక కవాతును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకొని చిన్నపాటి చర్య చేపట్టినా ఇరాన్ సైనిక బలగాలు విరుచుకుపడతాయని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వ కేంద్రస్థానాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయన్నారు. ఆ దేశ చర్యలను నిశితంగా గమనిస్తున్నామని పేర్కొన్నారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని కట్టడి చేసే ఒప్పందంపై జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఇది నియంత్రించలేకపోతోందని పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో తమ దేశానికి రక్షించుకునేందుకు అవసరమైన చర్యలను ఏకపక్షంగా చేపడతామని స్పష్టం చేసింది.















