తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. వారం రోజులపాటు సాగిన పర్యటనలో 35 బిజినెస్ సమావేశాలు జరగగా, ఐటీ, ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో నాలుగు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించినట్లు కేటీఆర్ తెలిపారు. మరో మూడు మీట్ అండ్ గ్రీట్ వంటి పెద్ద సమావేశాలకు హాజరైనట్లు తెలిపారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ.7500 కోట్ల పెట్టుబడులు రాబట్టగలిగినట్లు కేటీఆర్ వెల్లడిరచారు. ఈ పర్యటనకు ఏర్పాట్లు చేసిన తన వెంట ఉన్న సమర్థవంతమైన బృంద సభ్యులకు, అమెరికాలో తనను ఎంతగానో ఆదరించిన ఎన్నారైలకు, తన బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.