తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంలో అక్టోబర్ 9న నిర్వహిస్తున్న లండన్ చేనేత బతుకమ్మ, దసరా వేడుకల పోస్టర్‌ని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని తెలంగాణ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనివ్వడానికి చేస్తున్న కార్యక్రమాల స్పూర్తితో, గత కొన్ని సంవత్సరాలుగా టాక్ జరిపే బతుకమ్మ వేడుకలను చేనేత బతుకమ్మగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. వీలైనంత వరకు ప్రవాసుల్లో చేనేతపై అవగాహన కల్పించి, వీలైనన్ని సందర్భాల్లో చేనేత వస్త్రాలు ధరించి నేత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, కార్యదర్శి రవి రేతినేని, టాక్ తెలంగాణ ప్రతినిధి మల్లేష్ పప్పుల, సామాజిక కార్యకర్త వినయ్ గౌడ్ బత్తినితో పాటు పలువురు పాల్గొన్నారు.