జులై 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. జూలై 19న మొదలు ఆగస్టు 13 వరకు సమావేశాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. మొత్తం 19 పనిదినాల్లో ఉభయసభల కార్యకలాపాలు జరుగుతాయని తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ ఓంబిర్లా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ కొవిడ్ నిబంధనలను అనుసరించే వచ్చే ఎంపీలు మీడియా ప్రతినిధులు అందరినీ పార్లమెంటు లోపలికి అనుమతిస్తారని తెలిపారు. ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్టు తప్పనిసరి కాదని చెప్పారు. అయితే ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకోని వారు మాత్రం దయచేసి వ్యాక్సిన్‌లు వేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక ఇప్పటి వరకు 444 మంది లోక్‌సభ ఎంపీలు, 218 మంది రాజ్యసభ ఎంపీలు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దేశంలో కరోనా ఉధృతి కారణంగా గత మూడు సమావేశాల వ్యవధిని కుదించగా గతేడాది శీతాకాల సమావేశాలు మాత్రం రద్దయిన విషయం తెలిసిందే.