ఆసియా శ్రీమంతుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తిరిగి అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నారు. ఫోర్బ్స్ బిలియనీర్ 2023 జాబితా ప్రకారం ముకేశ్ అంబానీ 83.4 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో 9వ స్థానంలో ఉన్నారు. గౌతమ్ అదానీ ప్రస్తుతం 47.2 బిలియన్ డాలర్ల సంపదతో 24వ స్థానానికి దిగిపోయారు. భారతీయ ఐశ్వర్యవంతుల్లో అంబానీ అగ్రస్థానంలో ఉండగా, అదానీ ద్వితీయస్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో రికార్డుస్థాయిలో 169 భారతీయ వాణిజ్యవేత్తలు స్థానం సంపాదించారు. గత ఏడాది 166మందే. కానీ వీరి సంపద మాత్రం 10 శాతం క్షీణించి 750 బిలియన్ డాలర్ల నుంచి 675 బిలియన్ డాలర్లకు తగ్గింది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ 10 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నప్పటికీ, ఆయనకు ఉన్న సైప్రస్ దేశపు పాస్‌పోర్ట్ కారణంగా భారత జాబితాలో లేరు.

