గౌతమ్ అదానీకి ముకేశ్ అంబానీ షాక్ ఇచ్చారు. దేశీయ అపర కుబేరుడిగా మళ్లీ ముకేశ్ అంబానీ అవతరించారు. గౌతమ్ అదానీని వెనక్కినెట్టి 82 బిలియన్ డాలర్లతో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత భారతీయ సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ మేరకు విడుదలైన హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2023 స్పష్టం చేసింది. అలాగే ప్రపంచ టాప్-10 కుబేరుల్లో భారత్ నుంచి ఈసారి ముకేశ్‌కు మాత్రమే చోటు దక్కింది. 9వ స్థానంలో ఉన్నారు. ఇక 53 బిలియన్ డాలర్లతో అదానీ గ్రూప్ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ దేశీయ ధనవంతుల్లో రెండో స్థానంలో ఉన్నారు. నిజానికి నిరుడుతో పోల్చితే ముకేశ్ సంపద 20 శాతం (21 బిలియన్ డాలర్లు) క్షీణించింది. అయినప్పటికీ అదానీ సంపద ఏకంగా 60 శాతం పడిపోవడంతో నెంబర్ 1కు వచ్చారు. హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్ నేపథ్యంలో అదానీ సంపద పెద్ద ఎత్తున కరిగిపోయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే గరిష్ఠ సంపద స్థాయి నుంచి సగటున వారానికి రూ.3,000 కోట్లు నష్టపోయినట్టు తేలింది. అదానీ గ్రూప్ సంస్థలు అవకతవకలకు పాల్పడ్డాయంటూ జనవరి 24న అమెరికాకు చెందిన షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ రిపోర్టునిచ్చిన సంగతి విదితమే. అప్పట్నుంచి స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కుప్పకూలిపోయాయి. గ్రూప్ పరపతి కూడా దెబ్బతిన్నది.