శ్రీవిష్ణు, కేతిక శర్మ కలిసి నటించిన తాజా చిత్రం సింగిల్. గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్‌రాజు దర్శకుడు. ఈ సందర్భంగా కేతిక శర్మ విలేకరులతో ముచ్చటించింది. కెరీర్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. జయా పజయాలు మన చేతిలో ఉండవు. ప్రయత్నించడం వరకే మన పని. ఫలితంతో సంబంధం లేకుండా వృత్తిని ప్రేమిస్తూ ముందుకు వెళ్తున్నా అని చెప్పింది. ఈ సినిమాలో తాను పూర్వ అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తానని, తను ప్రాక్టికల్‌గా ఆలోచించే స్వతంత్ర భావాలు గల యువతి అని చెప్పింది. ఆద్యంతం చక్కటి వినోదంతో సాగే ముక్కోణపు ప్రేమకథా చిత్రమిదని, హృదయాన్ని తాకే ఎమోషన్స్ కూడా ఉంటాయని తెలిపింది.

శ్రీవిష్ణుతో పనిచేయడం హ్యాపీగా ఉందని, తన కామెడీ టైమింగ్ చాలా స్పెషల్ అని కేతిక శర్మ పేర్కొంది. డ్రీమ్ రోల్ గురించి చెబుతూ రష్మిక మందన్న ప్రస్తుతం గీతా ఆర్ట్స్‌లో గర్ల్‌ఫ్రెండ్ సినిమా చేస్తున్నది. అందులో ఆమెది అద్భుతమైన పాత్ర. ఆ తరహా క్యారెక్టర్ చేయాలన్నది నా డ్రీమ్. సాయిపల్లవి, కీర్తి సురేష్ మాదిరిగా పర్‌ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్స్ కోసం ఎదురుచూస్తున్నా అని చెప్పింది. తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతానికైతే సింగిలే. మనసుకు నచ్చిన వారు తారసపడితే ప్రేమలో పడతానేమో? ఇప్పుడు నా దృష్టంతా కెరీర్ మీదే ఉంది అని చెప్పుకొచ్చింది. ఈ నెల 9న విడుదలకానుంది.
