అమెరికా మేరీల్యాండ్‌లో జరిగిన కాల్పుల్లో నల్గొండ జిల్లా వాసి మృతి చెందాడు. నల్ల జాతీయుడు జరిపిన కాల్పుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి నక్కా సాయిచరణ్ (26) మృతి చెందారు. సాయిచరణ్ రెండేళ్ల క్రితం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లారు. ఉన్నత విద్య పూర్తయిన అనంతరం మేరీలాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ సిటీలో ప్రభుత్వ రంగ సంస్థ ఎన్విరాన్ సివిల్ ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. ఈ ఏడాది జనవరి 2న విధుల్లో చేరాడు. ఈ నెల 19వ తేదీ ఉదయం తన స్నేహితుడిని విమానాశ్రయంలో వదిలిపెట్టిన అనంతరం కారులో వెళ్తున్న సమయంలో ఓ నల్ల జాతీయుడు తుపాకీతో సాయిచరణ్‌పై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
అమెరికాలోని హరేగాన్ సిటీలో ఉంటున్న సోదరి హరికకు అక్కడి అధికారులు సమాచారం అందించగా ఆమె తన సమీప బంధువుల ద్వారా తల్లిదండ్రులకు తెలియజేశారు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సాయిచరణ్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. సాయిచరణ్ మృతదేహాన్ని త్వరలోనే నల్లగొండకు తెప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయిస్తానన్నారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయ అధికారులతో, మంత్రి కేటీఆర్‌తో భూపాల్‌రెడ్డి మాట్లాడారు. సాయిచరణ్ మృతదేహం ఈ నెల 25న నల్లగొండకు తీసుకొచ్చే అవకాశాలున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.














