కన్నడ అగ్ర నటుడు యశ్ నటిస్తున్న పాన్ ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామా టాక్సిక్. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ ఉపశీర్షిక. దర్శకురాలు గీతూమోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటిస్తారని వార్తలొచ్చాయి. ఇప్పటికే కియారా అద్వాణీ, హ్యూమా ఖురేషీ ఫస్ట్‌లుక్స్‌ని విడుదల చేయగా, వాటికి మంచి స్పందన లభించింది.

తాజాగా ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ నయనతార కూడా భాగమవుతున్నది. ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె గంగ అనే పాత్రలో కనిపించనుంది. మోడ్రన్ డ్రెస్‌లో చేతిలో గన్ పట్టుకొని కాసినో ద్వారం వద్ద ఉన్న నయనతార లుక్ ఆకట్టుకునేలా ఉంది. ధైర్యం, సాహసం ఊపిరిగా గంగ పాత్ర శక్తివంతంగా సాగుతుందని, కథాగమనంలో కీలకంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె నారాయణ, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకురానుంది.















