
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇరాన్ చంపాలని చూస్తున్నదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్ టార్గెట్ ట్రంపేనని, ఆ దేశానికి ప్రథమ శత్రువు అమెరికా అధ్యక్షుడేనని చెప్పారు. అణు ఒప్పందాన్ని రద్దు చేసినందుకే ట్రంప్‌ను లేకుండా చేయాలని ఇరాన్ భావిస్తున్నదని ఆరోపించారు. 2024లో రెండు సార్లు ఆయనను అంతమొందించడానికి ఇరాన్ ప్రయత్నించిందన్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ పరస్పర దాడుల నేపథ్యంలో నెతన్యాహూ మాట్లాడుతూ ట్రంప్‌ను చంపాలని ఇరాన్ చూస్తున్నది. ఆయనే ఇరాన్‌కు నంబర్‌వన్ శత్రువు. ట్రంప్ నిర్ణయాత్మక నాయకుడు. బలహీనమైన రీతిలో బేరసారాలు చేయడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడరు. ప్రత్యర్థికి లొంగిపోరు. గతంలో జరిగిన నకిలీ అణుఒప్పందాన్ని రద్దుచేసి, ఖాసిమ్ సులేమానీని మట్టుబెట్టారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే వారు యురేనియంను శుద్ధి చేయకూడదు. ఈ నేపథ్యంలో ట్రంప్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన శత్రువుగా మారారు. అందుకే ఆయనను చంపాలని చూస్తున్నదని చెప్పారు.
