కెనడాలో చదువుకుంటున్న భారత్‌తోసహా ఇతర అంతర్జాతీయ విద్యార్థుల ఆఫ్ క్యాంపస్ పని గంటలపై కెనడా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. వచ్చే సెప్టెంబర్ నుంచి అంతర్జాతీయ విద్యార్థులు వారానికి 24 గంటల వరకు మాత్రమే ఆఫ్ క్యాంపస్ పని చేయవచ్చు. ఈ చట్టం మంళవారం నుంచి అమలులోకి వచ్చింది. అంతర్జాతీయ విద్యార్థులు వారానికి 20 గంటలకు పైగా పనిచేసేందుకు అనుమతిస్తూ తీసుకు వచ్చిన తాత్కాలిక విధానం ఏప్రిల్ 30 తో ముగిసిపోతున్నట్లు ఇమిగ్రేషన్, శరశణార్థులు, పౌరసత్వ శాఖ మంత్రి మార్క్ మిల్లర్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త చట్టం ప్రకారం సెప్టెంబర్ నుంచి అంతర్జాతీయ విద్యార్థులు వారానికి 24 గంటల వరకు మాత్రమే ఆఫ్ క్యాంపస్ పని చేసుకోవ్చని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్ల పెంపునకు కత్తెర వేస్తూ కెనడా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.
అంతర్జాతీయ విద్యార్థులలో భారతీయ విద్యార్థులే అత్యధికంగా కెనడాలో చదువుకుంటున్నారు. కెనడాకు వచ్చే విద్యార్థులు చదువుపైనే ధ్యాస పెట్టాలని మిల్లర్ తెలిపారు. వారానికి 24 గంటల వరకు మాత్రమే పనిచేసే అవకాశం కల్పించడం వల్ల విద్యార్థులు ప్రధానంగా తమ దృష్టిని చదువుపైనే ఉంచుతారని, అవసరమైతేనే పనిచేస్తారని ఆయన తెలిపారు.