అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఐక్యరాజ్య సమితిలో మాజీ రాయబారి నిక్కీ హేలీ కీలక సూచనలు చేశారు. భారత్‌ను చైనాలాంటి ప్రత్యర్థిలా కాకుండా విలువైన స్వతంత్ర, ప్రజాస్వామ్య భాగస్వామిగా చూడాలని సూచించారు. గత 25 సంవత్సరాలుగా భారత్‌తో ఏర్పరచుకున్న సంబంధాలను అమెరికా వేగంగా ఆపివేస్తే అది వ్యూహాత్మక విపత్తు అవుతుందని హెచ్చరించారు. భారత్, చైనా మధ్య బలమైన భాగస్వామ్యం చాలా సులభమని నిక్కీ హేలీ అభివర్ణించారు. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశమని, దాని పెరుగుదల స్వేచ్ఛా ప్రపంచానికి ముప్పే కాదని స్పష్టం చేశారు.

దీనికి విరుద్ధంగా చైనా కమ్యూనిస్ట్ పాలనలో నడుస్తున్నందున దాని పెరుగుతున్న శక్తి ఓ సవాల్‌గా పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా చైనా ఆంక్షలను తప్పించుకుంటుండగా, మాస్కోకు అతిపెద్ద కస్టమర్ అన్నారు. అమెరికాకు భారత్ కీలకమైన మిత్రదేశంగా మారగలదన్నారు. ఆసియాలో చైనాతో పోటీపడాలంటే ఈ సమతుల్యతను తీసుకువచ్చే ఏకైక దేశం భారత్ మాత్రమేనని అమెరికా అర్థం చేసుకోవాలన్నారు. చైనాలాగానే పెద్ద ఎత్తున వస్తువులను తయారు చేసే సామర్థ్యం భారత్‌కు ఉందని హేలీ పేర్కొన్నారు. అమెరికా తన సరఫరా గెలుసును చైనా నుంచి భారత్‌కు మార్చేందుకు సహాయపడుతుందన్నారు.
















