ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిర్ణయాలు ఎప్పటికప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఆయన ఇచ్చే ఆదేశాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతూ ఉంటుంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి అన్ని దేశాలను కలవరానికి గురిచేస్తుండగా, అన్ని దేశాలు వ్యాక్సినేషన్ పై ఫోకస్ పెడుతున్నాయి. ఈ తరుణంలో కిమ్ షాకింగ్ ప్రకటన చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ తమకు అవసరం లేదని ప్రకటించారు. దీనికి బదులుగా తమదైన శైలిలో కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేయాలంటూ అధికారులను ఆదేశాలిచ్చారు. పేద దేశాలను ఆదుకునేందుకు కొవ్యాక్స్ కార్యక్రమం కింద ఐక్యరాజ్య సమితి ఇవ్వనున్న టీకాలను తిరస్కరించారు. ఈ మేరకు పొలిట్‌బ్యూరో సమావేశంలో కిమ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఉత్తర కొరియాలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసుల కూడా నమోదు కాలేదని చెప్పుకుంటోంది. పొలిట్‌బ్యూరో సమావేశంలో కిమ్ దీనిని ప్రస్తావిస్తూ మహమ్మారి వ్యాప్తి నిరోధంలో ఇకపైనా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇందుకోసం అన్ని చర్యలు తీసుకోవాలని ఆరోగ్య కార్యకర్తలకు తగు విధంగా శిక్షణ ఇవ్వాలని కోరారు.