తిరుమల తిరుపతి దేవస్థానానికి మరోసారి భారీ విరాళం అందింది. అమెరికాలో ఫార్మాస్యూటికల్ రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన పారిశ్రామిక వేత్త మంతెన రామలింగ రాజు, ఈసారి రూ. 9 కోట్లు విరాళంగా సమర్పించారు. ఈ మొత్తం ఆయన కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేర్లపై టీటీడీకి అందజేశారు. ఈ విరాళాన్ని అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఎంపీ అప్పలనాయుడు సమక్షంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ పీఏసీ 1, 2, 3 భవనాల ఆధునీకరణ కోసం మంతెన రామలింగ రాజు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. భక్తులకు మరింత మెరుగైన వసతులను అందించేందుకు ఈ విరాళం వినియోగించబడుతుందని చెప్పారు. ప్రతి రోజు లక్షల్లో భక్తులు తిరుమల చేరుతుండగా, కొత్త సౌకర్యాల అభివృద్ధి అత్యవసరమని, ఇలాంటి సేవాభావం ఎంతో ప్రేరణనిస్తుందని అన్నారు.

కాగా గతంలో కూడా మంతెన రామలింగ రాజు టీటీడీకి భారీ విరాళం ఇచ్చారు. 2017లో తిరుమల శ్రీవారికి 28 కిలోల బంగారు సహస్రనామ మాలను అందజేయడం ద్వారా ఆయన దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు.
















