ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. నేడు ఎన్టీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్ర టైటిల్‌ను ప్రకటించడంతో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు దేవర అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో ఎన్టీఆర్ నల్లటి దుస్తుల్ని ధరించి భారీ ఆయుధాన్ని చేతబూని శక్తివంతంగా కనిపిస్తున్నారు.
విస్మరణకు గురైన ఓ సుదూర తీరప్రాంత నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మనుషుల్లో మృగాల వంటి అత్యంత భయంకర స్వభావుల నుంచి తన వారిని రక్షించుకోవడానికి ధీరోదాత్తుడైన వ్యక్తి చేసే పోరాటమే ఈ చిత్ర కథాంశమని సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్నందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.